ప్రజావేదికతో మొదలై.. అమరావతి వరకు : దేవినేని ఉమా
రైతులకు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా చంద్రబాబు సీఆర్డీఏ చట్టం తెచ్చారని, ఆ చట్టమే ఇప్పుడు రాజధాని రైతులను కాపాడుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం అమరావతి విధ్వంసం వరకూ కొనసాగుతోందన్నారు. రైతులు అమరావతి కోసం ఆనందంగా భూములు ఇచ్చారని అన్నారు. అమరావతి గ్రాఫిక్స్ అంటున్న మంత్రులు ఇక్కడి భవనాల పైకి ఎక్కి దూకాలని, అప్పుడు రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని అన్నారు.
కృష్ణానదిలో వరదలతో అమరాతిని ముంచాలని చూసిన దుర్మార్గులు వీరన్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన వైకుంఠపురం వద్ద బ్యారేజీకి మేం పనులు ప్రారంభిస్తే జగన్ వాటిని ఆపేశారని మండిపడ్డారు. రైతుల భూముల్లో నిర్మించిన సచివాలయంలో కూర్చుని అమరావతికి వ్యతిరేకంగా జీవోలు ఇస్తున్నారన్నారు. నేలపాడులోని హైకోర్టు మాత్రమే ఇప్పుడు రైతులను కాపాడుతోందని తెలిపారు. న్యాయస్తానం లేకపోతే ఈ పాటికి జగన్ ఎవరినీ ఉండనిచ్చేవారు కాదన్నారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తామని తెలిపారు.













