ప్రజా సమస్యలపై పోరాడటమే తప్పా? : దేవినేని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తెలుగుదేశం పార్టీ నేత ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం సబబా అని ప్రశ్నించారు. ఇంకెంతమందిపై దాడి చేస్తారు? మీ కళ్లమంట చల్లారలేదా? ప్రజా సమస్యలపై పోరాడటమే తప్పా? ఇదేం సంస్కృతి? రాష్ట్రం ఎటు పోతుందో? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ ఆజ్ఞ లేనిదే ఇలాంటి దాడులు జరగవు. ప్రతిపక్ష నేతలతో పాటు టీడీపీ కార్యాలయంపై దాడులు చేశారు. దాడుల కుట్రదారులెవరో బయటకు రావాలి. దీనికి మంత్రి కాకాణి, సీఎం బాధ్యత వహించాలి. జగన్ కనుసన్నల్లో, సజ్జల డైరెక్షన్లోనే దాడులు జరుగుతున్నాయి. దాడులపై ఎస్పీ, డీఐజీ, డీజీపీ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.













