పోలీసులు ఎవరికి నోటీసులు ఇస్తారో.. సమాధానం చెప్పాలి
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను ఉగ్రవాదులు అంటున్నారని, మరి టీడీపీ కార్యాలయాలపై దాడి చేసిన వాళ్లు అహింసావాదులా? అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో దేవినేని మీడియాతో మాట్లాడుతూ ఏ ఆధారాలున్నాయని ఉగ్రవాదులంటున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై పోలీసులు ఎవరికి నోటీసులు ఇస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 28 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధ్యమన్నారని, మరి ఇంతవరకు ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
ప్రత్యేక హోదాపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఏనాడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. 28 మంది ఎంపీలు ఉన్నా ప్రధాని మోదీని ఎందుకు కలవలేకపోయారని అన్నారు. ప్రధానిని కలిసేందుకు సీఎం జగన్, విజయసాయి ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆర్థిక ఉగ్రవాది విజయసాయిరెడ్డి వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నడవడిక నేర్చుకోవాలా? చంద్రబాబు పోరాడుతుంటే విజయసాయిరెడ్డికి ఢిల్లీ లో వణుకొస్తోందని అన్నారు.













