Devineni: ఉమాకు మళ్ళీ దెబ్బ పడ్డట్టే…?
తెలుగుదేశం(TDP) పార్టీలో కొంతమంది నేతలు.. కార్యకర్తలకు సుపరిచితం. పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా సరే మీడియాలో వాళ్ల గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. అందులో మైలవరం నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమ(Devineni Uma) కాస్త ఎప్పుడు ప్రచారంలో ఉండేవారు. మంత్రిగా ఉన్నా.. మంత్రిగా లేకపోయినా సరే ఏదో ఒక విషయంలో ఆయనను మీడియా హైలెట్ చేస్తూనే ఉండేది. అయితే 2024 లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవినేని సైలెంట్ అయిపోయారు. నియోజకవర్గంలో ఆయనకు పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదు.
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ డామినేషన్ ఎక్కువగా ఉండటంతో దేవినేని ఉమా పెద్దగా యాక్టివ్ గా కనపడటం లేదని చెప్పాలి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలు కావడంతో దేవినేని ఉమాకు ఖచ్చితంగా సీటు వస్తుందని ప్రచారం జరుగుతుంది. 2024 ఎన్నికల్లో అధిష్టానం కోరిక మేరకు వసంత కృష్ణ ప్రసాద్ కు సీటు వదులుకున్న దేవినేని.. ఇప్పుడు ఎమ్మెల్సీగా మండలి లో అడుగు పెట్టాలని కాస్త పట్టుదలగా ఉన్నారు. కార్పొరేషన్ పదవుల్లో ఏదో ఒక పదవి ఆయనకు వస్తుందని భావించారు.
గుడివాడకు చెందిన రావి వెంకటేశ్వరరావుకు పదవి రావడంతో కచ్చితంగా దేవినేని ఉమాకు కూడా ఏదో ఒక పదవి వస్తుందని అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు ఉమాకు ఏ పదవిని ఖరారు చేయలేదు. ఇక ఎమ్మెల్సీ స్థానాల్లో ఐదు ఖాళీగా ఉండటంతో అందులో ఒకటి.. కచ్చితంగా ఉమాకు కేటాయించే అవకాశం ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబుకి అత్యంత దగ్గరగా ఉండే నేతగా చెప్పుకునే దేవినేని ఉమా 2023 తర్వాత ప్రాభవం కోల్పోయారు.
అయితే లోకేష్ తో ఆయనకు విభేదాలు ఉన్నాయని, అందుకే 2024 లో సీటు వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించాల్సిన పరిస్థితి వచ్చిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు ఉమాకు ఎమ్మెల్సీ వస్తుందా? రాదా? అనేదే ఆసక్తికరంగా మారింది. అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత దీనిపై చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.













