పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో ? : దేవినేని
పోలవరం ప్రాజెక్టు విషయంలో సాక్షాత్తు మంత్రులే అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో సృష్టం చేయాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం నిర్వాసితుల తరపున తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోందన్నారు. పోలవరం ఎత్తు విషయంలో అనేక అనుమానాలున్నాయని, వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు దీనిపై ఆందోళనగా ఉన్నాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ప్రారంభించారని చెబుతున్నారని, కానీ కేవలం అప్పుడు మట్టిపనులు మాత్రమే పూర్తయ్యాయని దేవినేని ఉమ గుర్తు చేశారు.
కాంగ్రెస్ వైఖరితో పోలవరంపై రూ.2,537 కోట్ల అదనపు భారం పడిందని ఆరోపించారు. 150 అడుగులు కట్టాల్సిన డ్యామ్‌ని 135 అడుగులు కట్టాలని రాజీపడ్డారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసమే స్పిల్‌వే, రాక్‌ఫిల్ డ్యామ్, పవర్ ప్రాజెక్టు పనులు రద్దు చేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును తెలుగువాడి గుండెచప్పుడుగా దేవినేని అభివర్ణించారు.













