తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ ప్రమాణ స్వీకారం
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలవడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వారికి సక్రమంగా అందేలా, వాటిపై అవగాహన కల్పించేలా తెలుగు యువత పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు పేర్కొన్నారు. విజయవాడలోని సిద్దార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో జరిగిన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాస్ ప్రమాణ స్వీకారోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ పట్టం కట్టేలా కృషి చేయాల్సిన బాధ్యత తెలుగుయువతపై ఉందని చెప్పారు. అవినాష్‌కు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అవినాస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ తన తండ్రి నెహ్రూ మృతి చెందిన తర్వాత మేమున్నామని చంద్రబాబు, లోకేష్‌లు వెన్నుతట్టి ప్రోత్సహించారని చెప్పారు. ఎవరైనా ముఖ్యమంత్రిని టచ్ చేయాలంటే తెలుగు యువతను దాటి వెళ్లాలని విపక్షాలను హెచ్చరించారు.













