ఇండస్ట్రియల్ కారిడార్ లతో ఎపి అభివృద్ధి : సీఎం వై.ఎస్. జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక రంగంలో అడుగులు పడుతున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మనం ఈరోజు మూడు సంవత్సరాలుగా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మనమే అవార్డు తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. 3 ఇండస్ట్రియల్ కారిడార్లతో రాష్ట్రంలో అభివృద్ధి సాగుతోందని చెప్పారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఏపీ ఎస్ఈజెడ్లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ఫేజ్‌ను ముఖ్యమంత్రి ఇటీవల ప్రారంభించారు. మరో 8 కంపెనీలకు కూడా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దేవుడి దయతో ఒక పరిశ్రమను ప్రారంభోత్సవం చేసుకోవడంతోపాటు, రెండో దశ ప్లాంట్ విస్తరణ పనులకూ శంకుస్ధాపన చేశాం. మనమిచ్చే ప్రోత్సాహం, మద్దతు వారిని ఆకట్టుకుంది. అందుకే రెండోదశకు కూడా నాందిపలుకుతున్నారు. ఒకవైపు తొలిదశ ప్రాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంటే.. మరోవైపు సెకెండ్ ఫేజ్‌కు శంకుస్ధాపన కార్యక్రమం జరుగుతుంది. ఈ రెండో దశ కూడా సరిగ్గా 12 నెలల్లోనే ఆగష్టు 2023లోగా పూర్తి చేస్తామని చెప్తున్నారు. తొలిదశలో రూ.1250 కోట్ల రూపాయలతో దాదాపు 1200 మందికి ఉద్యోగాలు ఇక్కడే కల్పించారు. ఇవాళ మొదలయ్యే రెండోదశలో మరో రూ.850 కోట్లతో పనులు చేపట్టడంతో పాటు మరో 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొత్తంగా 2000 మందికి ఉపాధి ఇక్కడే.. మన పిల్లలకే అందుబాటులోకి వస్తుంది.
ఇవన్నీ కూడా ఎందుకు చెపుతున్నానంటే.. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, బాగుపడాలన్నా ఆ ప్రాంతంలో మన పిల్లలకు మెరుగైన ఉద్యోగాలు అందడం చాలా అవసరం. అలా ఆ ప్రాంతంలో చదువుకున్న మన పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇక్కడే మనం ఇప్పించగలిగితే.. పేదరికం నుంచి మన పిల్లలు బయటపడే పరిస్థితులు ఇంకా మెరుగవుతాయి. దీనికోసం ప్రభుత్వం పరంగా మనం చేయాల్సినవి అన్నీ కూడా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. నేడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ ఏపీ నిలిచిందన్నారు.
ఎంఎస్ఎంఈలకు ప్రోత్సహం ఇచ్చే కార్యక్రమం గత ప్రభుత్వాలు ఎప్పుడో మర్చిపోయిన సందర్భంలో… మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా గుర్తు పెట్టుకుని పాత బకాయిలను క్లియర్ చేస్తూనే, మరోవైపు ఎలాంటి బకాయిలు లేకుండా ప్రతి సంవత్సరం వారికి రావాల్సిన ఇన్సెంటివ్‌లు అందిస్తున్నాం. వాళ్లను చేయిపట్టుకుని నడిపిస్తూ ప్రోత్సహిస్తూ ఈ మూడు సంవత్సరాల కాలంలో రూ.1463 కోట్లు ఎంఎస్ఎంఈలకు ఇచ్చాం. ఈ రకంగా ప్రభుత్వం ప్రతి దశలోనే ప్రోత్సహిస్తూ.. అడుగులు ముందుకు వేస్తుంది కాబట్టే ఈ రోజు.. 2021`22 చూస్తే ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ గ్రోత్‌రేట్ 11.43 శాతం సాధించాం. దేశంలో చూస్తే అది కేవలం 8.9శాతమే. దేశంతో పోలిస్తే.. రాష్ట్రం వేగంగా అడుగులు ముందుకేస్తోంది.
ఎగుమతుల్లో చూస్తే.. ఇప్పటికే మన రాష్ట్రంలో ఆరు పోర్టులుంటే.. ఈ 3 ఏళ్లకాలంలో వేగంగా మరో 4 పోర్టులు కట్టేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నాం. ఒకవైపు పోర్టులు కొత్తవి నిర్మించడంతో పాటు 9 ఫిషింగ్ హార్బర్లుకూడా నిర్మిస్తున్నాం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్ కాని, ఒక పోర్టునుకాని అందుబాటులోకి తెస్తున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు ఆంధ్రరాష్ట్రంలో 2021`22 ఆర్ధిక సంవత్సరంలో ఎక్స్‌పోర్టెడ్ గూడ్స్ 19.3 బిలియన్ డాలర్లు అంటే ఇది మొత్తం దేశం ఎగుమతుల్లో 4.58 శాతం. ఈ పోర్టులు పూర్తయిన తర్వాత ఏపీ నుంచే 10శాతం ఎగుమతులు తీసుకొచ్చే విధంగా అడుగులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏపీలో మాత్రమే ఉన్నాయి. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగుళూరు, హైదరాబాద్-బెంగుళూరు కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే. గతంలో మన రాష్ట్రంవైపు చూడని వారు కూడా ఇప్పుడు మన వైపు చూస్తున్నారు. మన రాష్ట్రంలోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో సెంచరీ ప్ల్కె వుడ్ భజంకాలు పేరు విన్నారా ? ఈ రోజు వైయస్సార్ జిల్లా బద్వేలులో సెంచరీ ప్ల్కెవుడ్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. గతంలో బంగర్‌ల పేర్లు ఎప్పుడైనా విన్నారా? గతంలో ఎప్పడూ రాష్ట్రంవైపు చూడని వాళ్లు శ్రీ సిమెంట్స్.. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యాక్టరీ పెడుతున్నారు. గతంలో ఆదిత్యా బిర్లా ఏపీకి వచ్చి, సీఎంతో కలిసి వారి ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న విషయం మీరు చూశారా? ఈ రోజు ఆదిత్య బిర్లా కూడా ఆంధ్రరాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రితో సహా వెళ్లి వాళ్ల ప్లాంట్ ప్రారంభిస్తున్నారు. గతంలో అదానీ, అదానీ అని పేరుకు మాత్రమే అనేవారు. కానీ ఆదానీ అనే సంస్ధ గతంలో ఏపీలో ఎప్పుడూ అడుగులు ముందుకు వేయలేదు. కేవలం జగన్ సీఎం అయిన తర్వాతనే అదానీలు ముందడుగు వేశారు. ప్రతి పెద్ద పరిశ్రమకు చెందిన వారందరూ కూడా ఏపీ వైపు చూసేట్టుగా అడుగులు పడుతున్నాయి.
పారిశ్రామిక వేత్తలందరికీ ఒకటే మాట చెప్తున్నాం. మీరు పరిశ్రమ పెట్టండి.. అన్నిరకాలుగా సహాయ, సహకారాలిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది. అదానీ డేటా సెంటర్‌కు కూడా బహుశా వచ్చే నెలలో విశాఖలో శ్రీకారం చుడుతోంది. ఇలా ఎన్నో సంస్థలను రాష్ట్ర అభివృద్ధికోసం తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వివరించారు.













