చంద్రబాబు భావి భారత ప్రధాని: దేవెగౌడ
తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబును భావి భారత ప్రధానిగా దేవెగౌడ సంబోధించారు. సోమవారం సాయంత్రం కృష్ణా జిల్లా తిరువూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబుతో కలిసి దేవెగౌడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి చంద్రబాబేనన్నారు. డిజిటల్, స్మార్ట్ ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. యువతకు ఉద్యోగాల పేరిట మోసం చేశారని మండిపడ్డారు. ఏపీలో నిరుద్యోగ భృతి, పింఛను రూ.2వేలు ఇవ్వడం చాలా బాగుందని చెప్పారు. గత ఎన్నికల్లో ఏపీకి ఇచ్చిన హామీలను మోదీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు వల్లే అమరావతి నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. కేంద్రం సాయం చేయకున్నా పోలవరం పనులు జరుగుతున్నాయని చెప్పారు. చంద్రబాబుకు ఓటేస్తే ప్రజల భవిష్యత్తు బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సిద్ధాంతపరంగా ఒకే రకమైన భావజాలమున్న ప్రాంతీయ పార్టీలు కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడడం శుభపరిణామమని దేవెగౌడ అన్నారు.
దేశంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని దేవెగౌడ ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలోని పలు మీడియా సంస్థలను సైతం మోదీ తన అదుపులో ఉంచుకుంటున్నారని ఆరోపించారు. వృద్ధాప్య పింఛను, నిరుద్యోగ భృతి వంటి కార్యక్రమాలను చంద్రబాబు విజయవంతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. మోదీకి వ్యతిరేకంగా నిలబడిన ప్రాంతీయ పార్టీలపై కేంద్రం సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థలతో దాడులు చేయిస్తోందని దుయ్యబట్టారు. కర్ణాటక, బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఏపీల్లో దాడులు చేయించిందని, ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేలా చంద్రబాబు తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. మోదీ అప్రజాస్వామిక విధానాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన పిలుపునిచ్చారు.













