Bhimavaram DSP: భీమవరం డీఎస్పీపై పవన్ కల్యాణ్ ఫైర్..! వేటు తప్పదా..?

భీమవరం డీఎస్పీ జయసూర్య (DSP Jayasurya) వ్యవహార శైలిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయనపై తరచూ ఫిర్యాదులు వస్తుండడంతో దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన ఎస్పీని ఆదేశించారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఫిర్యాదును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ అంశంపై హోంమంత్రి, డీజీపీలతో చంద్రబాబు (CM Chandrababu) సమావేశమయ్యారు. డీఎస్పీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.
భీమవరం ప్రాంతంలో పేకాట శిబిరాలు వంటి అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని, వాటికి డీఎస్పీ అండగా ఉంటున్నారని పవన్‌కు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. అంతేకాక, డీఎస్పీ జయసూర్య తన పరిధి దాటి సివిల్ వివాదాలలో జోక్యం చేసుకుంటున్నారని, కొందరి పక్షం వహిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. డీఎస్పీ జయసూర్య కొందరి పక్షం వహిస్తూ, అధికార కూటమి నేతల పేరును, ముఖ్యంగా జనసేన పార్టీ నేతల పేరును వాడుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జయసూర్య గన్నవరం డీఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన వైసీపీకి విధేయత చూపారని, తర్వాత కొంతమంది నేతల ద్వారా భీమవరంలో పోస్టింగ్ పొందారని కూడా స్థానిక రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
డీఎస్పీపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్‌గా స్పందించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన ఈ అంశంపై తక్షణమే చర్యలు తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి, డీఎస్పీ జయసూర్య వ్యవహారశైలిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డీఎస్పీపై వచ్చిన ఆరోపణల విషయాన్ని హోం శాఖ మంత్రి అనితకు, డీజీపీకి తెలియజేసి, ఆయన వ్యవహారంపై పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలని, అసాంఘిక కార్యకలాపాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటాన్ని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలని ఆయన ఎస్పీకి సూచించారు. ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతిభద్రతలను పరిరక్షించాలని స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన ఫిర్యాదును ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అంశాలు రావడంపై ఆయన హోంమంత్రి, డీజీపీలను పిలిపించుకుని మాట్లాడారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద, డీఎస్పీ జయసూర్యపై పవన్ కల్యాణ్ చేసిన ఫిర్యాదు కేవలం వ్యక్తిగత అంశం కాకుండా, పోలీసు వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుతమైన పనితీరును ఆశించడంపై ఆయన చూపిన చిత్తశుద్ధిగా కూటమి వర్గాలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో ప్రక్షాళన చేయాలనే పవన్ కల్యాణ్ ఉద్దేశాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫిర్యాదు సంచలనం సృష్టించగా, డీఎస్పీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.