కృష్ణ నటనలోనే కాదు వ్యక్తిత్వంలో గొప్పవాడే: డిప్యూటీ సీఎం
తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని పరిశ్రమకే మూలస్తంభంలా ఎదిగిన గొప్ప నటుల్లో సూపర్ స్టార్ కృష్ణ పేరు టాప్లో ఉంటుంది. అటువంటి గొప్ప నటుడు మంగళవారం ఉదయం మరణించిన వార్త యావత్ తెలుగు చిత్రసీమను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. అయితే తాజాగా కృష్ణపై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కృష్ణ నటనలోనే కాక వ్యక్తిత్వంలోనూ ఉన్నతమైన వ్యక్తి అని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగు చిత్రసీమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఆయనకున్న గుర్తింపు సినిమాలకే పరిమితం కాలేదని, ఆయన నిజ జీవితంలోనూ అదే విధంగా ఉండేవారని, తప్పును తప్పని చెప్పడంలో ఏమాత్రం వెనుకాడేవారు కాదని చెప్పుకొచ్చారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతటివారినైనా ఎదిరించి నిలబడే వారని, తన సిద్దాంతాలను ఒప్పని చెప్పుకోవడంలో ఏమాత్రం సంకోచించరని తెలిపారు. ఏలూరులో ఎంపీగా పోటీ చేసి అద్భుతమైన విజయం నమోదు చేశారు. ఆయన ఎంపీగా విధులు నిర్వహించింది రెండేళ్లే అయినా, ఆ కాలంలోనే ముంపు బాధిత రైతులకు ఆయన చేసిన సహాయం అంతా ఇంతా కాదని తెలిపారు. ఆయన సినిమాల్లోనే కాక రాజకీయాల్లోనూ ఎంతో క్రియాశీలక పాత్ర పొషించారని, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి, రాజీవ్ గాంధీకి కృష్ణ ఎంతో సన్నిహితుడని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా మన సీఎం జగన్ మోహన్ రెడ్డికి, కృష్ణ కుటుంబానికి ఎనలేదని సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అటువంటి మహోన్నత వ్యక్తి ఇక మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం, ఆయన లోటు తీరనిదని అన్నారు. అనంతరం కృష్ణ కుటుంబీకులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.













