వచ్చే ఎన్నికల్లోనూ ఆయన భీమిలి నుంచే
మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లోనూ భీమిలి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఇటీవల పార్టీ చేసిన సర్వేలో భీమిలిలో గంటాకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని రావడంతో ఆయన మనస్తాపం చెందారని తెలిపారు. పనిచేసే మంత్రిపై ఇలాంటి సర్వే రావడం దురదృష్టకరమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గంటా భీమిలి నుంచి మరోసారి పోటీ చేసి గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న గంటా రెండ్రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. పార్టీల నేతలకు సైతం ఆయన దూరంగా మెలుగుతున్నారు. దీంతో ఆయన పార్టీ మారనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో గంటాను బుజ్జగించేందుకు విశాఖ ఇన్ఛార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటించనున్న నేపథ్యంలో గంటా ఇంటికి ఆయన వెళ్లారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో గంటా ఫోన్లో మాట్లాడారు. కాసేపటి తర్వాత గంటా శ్రీనివాసరావు, చినరాజప్ప సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సర్వే కారణంగానే గంటా మనస్తాపం చెందారని, వచ్చే ఎన్నికల్లో ఆయన భీమిలి నుంచే పోటీ చేస్తారని చినరాజప్ప తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటలోనూ ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు.













