శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీనివాస దీక్షితులు తెలిపారు. స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు అలంకరించినట్లు తెలిపారు.













