అవినాష్ బెయిల్ రద్దు చేయాలి..దస్తగిరి
ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిన వివేకా హత్య కేసు విషయంలో మరొక లేటెస్ట్ ట్విస్ట్. ఈ హత్య కేసులో నిందితుడు ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దస్తగిరి తన పిటిషన్ లో అవినాష్ రెడ్డి కోర్టు ఆదేశించిన షరతులను ఉల్లంఘిస్తున్నాడని పేర్కొన్నాడు. దీనితో పాటుగా తన కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్నట్లు దస్తగిరి ఆరోపించాడు. అవినాష్ 20 కోట్ల ఆశ చూపి తనను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు దస్తగిరి వాపోయాడు. ఇక ఈరోజు ఈ కేసు పై విచారణ జరగగా.. దస్తగిరి వాదనను సమర్థిస్తున్నారా..? వ్యతిరేకిస్తున్నారా..? సిబిఐ ను ప్రశ్నించింది. దీనికి స్పందించిన సిబిఐ.. దస్తగిరి వాదనను సమర్థిస్తున్నట్లు తెలియపరిచింది. ఈ నేపథ్యంలో బెయిల్ రద్దుకు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదు అని హైకోర్టు ధర్మాసనం సిబిఐ ను ప్రశ్నించడం జరిగింది. వాదోపవాదాల అనంతరం తెలంగాణ హైకోర్టు ఈ కేసు పై తదుపరి విచారణ ఏప్రిల్ 15 కు వాయిదా వేసింది. మరి అవినాష్ రెడ్డి బెయిల్ పరిస్థితి ఏమిటి అనేది ఏప్రిల్ 15 తేలుతుంది.












