ఈ నెల 10 నుంచి దసరా వేడుకలు
విజయవాడ దుర్గ గుడిలో దసరా ఉత్సవాలను ఈ నెల 10 నుంచి 18 వరకూ నిర్వహించనున్నారు. వేడుకలకు ఏర్పాట్లపై నిర్వహించిన పాలకమండలి సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏర్పాట్లకు ఈ ఏడాది రూ.8.30 కోట్లు వ్యయం చేస్తున్నారు. రాష్ట్ర పండుగగా దసరాను నిర్వహిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో కోటేశ్వరమ్య తెలిపారు. దసరా సాంస్కృతిక కార్యక్రమాలను దేవస్థానమే నిర్వహిస్తుందని వెల్లడించారు. ఆలయానికి సంబంధంలేని సంస్థలు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు నిధులు వెచ్చించకూడదని తీర్మానించినట్లు చెప్పారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే ప్రముఖు (వీఐపీ)లకు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నట్లు ఈవో తెలిపారు. సమావేశంలో పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు తదితరులు పాల్గొన్నారు.













