ఆ బిల్లుల ఆమోదం చట్టవ్యతిరేకం…చంద్రబాబు
ఆంధప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై గవర్నర్ సంతకం చేసి ఆమోదముద్రవేయడం అన్యాయమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గవర్నర్ సంతకం చేసినంత మాత్రాన అది రాజ్యాంగ, చట్ట వ్యతిరేకం కాకుండా పోతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ వ్యవహారంలో చివరికి రాజ్యాంగం, చట్టం గెలిచి న్యాయం జరిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. గవర్నర్ నిర్ణయం చారిత్రక తప్పిదం, రాజ్యాంగ విరుద్ధం, విభజన చట్టానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. అమరావతిలో రాజధానిని అభివ•ద్ధి చేస్తామని భూములిచ్చిన రైతులకు చట్టపరంగా హామీ ఇచ్చామని.. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించి విశ్వాసఘాతుకానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. అమరావతి పరిరక్షణ సమితి ఐకాసతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా న్యాయ, ప్రజాపోరాటం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్ ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తామని చెప్పారు.
రాజధాని నిర్మిస్తామని నమ్మి 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు జగన్ నమ్మక ద్రోహం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. జరిగిన పరిణామాలన్నీ తెలిసీ గవర్నర్ సంతకం పెట్టడం మరో దుర్మార్గమని అన్నారు. ‘‘బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ శాసన మం డలి నిర్ణయం తీసుకొంది. ఈ విషయం అడ్వొకేట్ జనరల్ స్వయంగా హైకోర్టుకు తెలిపారు. సెలెక్ట్ కమిటీకి పంపినా ప్రభుత్వం అధికారుల ద్వారా అడ్డంకులు స•ష్టిస్తోందని శాసన మండలి చైర్మన్ స్వయంగా గవర్నర్‌ను కలిసి చెప్పారు. ఇవన్నీ తెలిసి కూడా గవర్నర్ ఎలా సంతకాలు పెడతారు?’’ అని ప్రశ్నించారు. గవర్నర్ సంతకం పెట్టినంత మాత్రాన చట్టం, రాజ్యాంగం మారిపోతాయని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ తొలగింపు నిర్ణయంపై ఆయన సంతకం పెట్టారు. ఏమైంది? చివరకు రాజ్యాంగమే గెలిచింది’ అని తెలిపారు. ఈ విషయమై తాము అమరావతి రైతులతో కలిసి ఆందోళనలు, న్యాయపోరాటం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.













