VPR: వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మద్దతు గా నిలిచిన దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి..

నెల్లూరు జిల్లా కోవూరు (Kovuru) నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Reddy) ఇటీవల తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (Vemireddy Prasanthi Reddy) పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు అన్ని పార్టీల నాయకులు ఖండిస్తూ తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఇప్పటికే కూటమి పార్టీల నేతలు, కమ్యూనిస్టు నాయకులు ఆయన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. తాజాగా ఈ అంశంపై నందమూరి ఆడపడుచులు బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) మరియు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) కూడా స్పందించారు.
పురందేశ్వరి మాట్లాడుతూ, ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, మహిళలను కించపరిచే ధోరణి వైసీపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. శాసనసభలోనూ, బయటా మహిళలపై అసభ్యమైన వ్యాఖ్యలు చేయడం అనైతికమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలతో గౌరవంగా వ్యవహరించే బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉంటుందని, అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.
అంతేకాక, ప్రసన్న చేసిన వ్యాఖ్యలను ఆయన తల్లి, భార్యకు చూపించాలని పురందేశ్వరి సూటిగా అన్నారు. వారు ఆ వ్యాఖ్యల్ని సమర్థిస్తే తాను తన మాటల్ని వెనక్కు తీసుకుంటానని, లేదంటే ప్రసన్న బేషరతుగా ప్రశాంతిరెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నారా భువనేశ్వరి కూడా స్పందించారు. మహిళల పట్ల వైసీపీ నాయకుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ మహిళా ఎమ్మెల్యేపై వైసీపీ నేత చెయ్యగలిగిన వ్యాఖ్యలు సమాజం మొత్తం గౌరవించే విధంగా ఉండాలని ఆమె అన్నారు. ప్రసన్న చేసిన మాటలు మర్యాదలకు మాయని మచ్చగా పేర్కొన్నారు.
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి తన పూర్తి సంఘీభావం తెలుపుతున్నానని భువనేశ్వరి అన్నారు. మహిళల గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాలపై సమాజం అంతా ఒకటిగా స్పందించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలకు రాజకీయాల్లో స్థానం ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో, మహిళల పట్ల మరింత బాధ్యతగా, గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరం రాజకీయ నాయకులపై ఎంత ఉందో మరోసారి బహిరంగంగా చర్చకు వచ్చింది.