సొంతగూటికి ‘దాడి’ వర్గం…
విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి రాష్ట్రరాజకీయాల్లో చక్రం తిప్పిన దాడి వీరభద్రరావు.. అనుచరులతో పాటు సైకిలెక్కారు. అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో దాడి .. టీడీపీలో చేరారు. వైసీపీలో ఇమడలేని పరిస్థితి రావడంతో .. దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు రత్నాకర్.. వైసీపీకి గుడ్ బై చెప్పారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి నుంచి ఒకనాడు రాజకీయాలను శాసించిన నేతల్లో దాడి వీరభద్రరావు ఒకరు. ఆయన వైసీపీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. 2014లో దాడి రత్నాకర్ కు విశాఖ వెస్ట్ టికెట్ ఇస్తే ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీని వదిలేసిన దాడి కుటుంబం ….2019లో మళ్లీ పార్టీలో చేరారు. చివరి క్షణంలో పార్టీలోకి రావడంతో వారికి టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.
రాబోయే ఎన్నికలపైనే దాడి ఫ్యామిలీ ఆశలు పెట్టుకుంది. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ చోడవరం లేదా యలమంచిలికి షిఫ్ట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. బలమైన సామాజికవర్గానికి చెందిన దాడి వీరభద్రరావుకి అనకాపల్లి టికెట్ ఇవ్వాల్సి ఉందని మొదటి నుంచి కూడా స్థానిక కేడర్ భావించింది. దాడి వీరభద్రరావు ఫ్యామిలీకే టికెట్ ఖాయం అని అనుకున్నారు. అయితే, అనకాపల్లి టికెట్ రేసులోకి సత్యవతి కూడా వచ్చారు. ఆమె ఎంపీగా ఉన్నారు. ఆమె కూడా అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. సత్యవతికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొచ్చనే ఊహాగానాలు ఎక్కువ కావడంతో దాడి ఫ్యామిలీకి ఈసారి టికెట్ లేదనే భావించారు. సామాజిక సాధికార బస్సు యాత్రకు దాడి వీరభద్రరావు ఫ్యామిలీకి ఆహ్వానం లేకపోవడం, ఆలయ కమిటీకి సంబంధించి వారి కుటుంబానికి చోటు కల్పించకపోవడంతో దాడి వీరభద్రరావు మనస్తాపం చెందారు. అప్పటి నుంచి కూడా ఆయన పార్టీ మారతారు అనే ఊహానాగాలు వినిపించాయి.
ఈ క్రమంలో ఒక్కసారిగా వైసీపీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ టికెట్ కనుక తమకు కేటాయిస్తే కచ్చితంగా గెలిచి తీరతామని దాడి ఫ్యామిలీ చెబుతోంది. అనకాపల్లి నుంచి దాడి వీరభద్రరావు లేదా ఆయన కుమారుడు రత్నాకర్ కానీ పోటీ చేసే అవకాశం ఉంది. దాడి కుటుంబం అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశించింది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తమకే సీటు కేటాయిస్తారని ఆశించింది. అయితే వైసీపీలో ఆ పరిస్థితులు కనిపించకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక గతకొంత కాలంగా దాడి వీరభద్రరావు, మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మధ్య విభేదాలు ఉన్నాయి. అటు పార్టీలో తనకు గుర్తింపు లేదని దాడి వీరభద్రరావు ఆవేదనగా ఉన్నారు.













