అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ పూర్తిగా కట్టుబడి ఉందని ఆ పార్టీ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. దేశ్యాప్తంగా ఉద్యమించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిన 10 కీలక అంశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా చేర్చింది. కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని సృష్టం చేసింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అధ్యక్షతన సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం ఢిల్లీలో జరిగింది. ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి విస్తృతస్థాయి సమావేశం ఇదే.
సీడబ్ల్యూసీలో ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఒడిసా, బిహార్ కూడా వెనకబడి ఉన్నాయని, వాటికీ ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఒడిసా పీసీసీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ వాదించారు. ఆయన వాదనను సోనియా, రాహుల్ అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. దానికి అన్యాయం జరిగింది. అందుకే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని హామీఇచ్చాం. ఆ రాష్ట్రంతో ఇతర రాష్ట్రాలను పోల్చేందుకు వీల్లేదు అని సోనియా గాంధీ సృష్టం చేశారు. నిర్దిష్ట పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చామని, దానికి కట్టుబడి ఉన్నామని, ఆ రాష్ట్రంతో పోల్చుకోవడం సరికాదన్నారు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ ఏపీకి ప్రత్యేక హోదాపై ఎవరూ మాట్లాడడానికి వీల్లేదని రాహుల్ తేల్చి చెప్పారు.













