ఈసీ నుంచి ఆదేశాలు వస్తే ఏం చేద్దాం?.. సీఎస్ తో డీజీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రోజు, అనంతరం జరిగిన హింసపై సిట్ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన నేపథ్యంలో సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా భేటీ అయ్యారు. సచివాలయంలో ఇద్దరు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. సిట్ ప్రాథమిక నివేదికపై ఈసీ నుంచి తదుపరి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సి చర్యలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ దర్యాప్తులో పోలీసుల వైఫల్యాలు వెలుగుచూశాయి.
పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో రెండు రోజులుగా విస్తృతంగా పర్యటించిన సిట్ బృందాలు 6 నియోజకవర్గాల పరిధిలో తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదైన 33 కేసులను పరిశీలించాయి. వీటికి సంబంధించి 150 పేజీల సమగ్ర నివేదికను సిట్ అధిపతి వినీత్ బ్రిజ్‌లాల్, ఎస్పీ రమాదేవి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేశారు. ఆయన ఈ నివేదికను ఎన్నికల సంఘానికి పంపించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో సిట్ నివేదిక కలకలం రేపుతోంది. ఈసీ నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయోనని పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది.













