నెల రోజులైనా .. ఒక్క ఆధారం చూపలేకపోయారు : రామకృష్ణ
ముఖ్యమంత్రి జగన్కు ప్రజలు, ప్రతిపక్షాలు మాత్రమే కాదు, చివరకు సుప్రీంకోర్టు అన్నా లెక్క లేకుండా పోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల అంశం సుప్రీం కోర్టులో ఉండగానే, ఆయన పరిపాలన రాజధానిని విశాఖకు తరలించడం ఏంటని ప్రశ్నించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన ఒక ముఖ్యమంత్రి ఇలా దొడ్డి దారిన వెళ్తున్నారన్నారు. వెనుకబడిన ప్రాంతాల కోసం అని చెబుతున్న జగన్ కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం రాయలసీమ నాలుగు జిల్లాలు వెనుకబడిన ప్రాంతాలే కదా? అని ప్రశ్నించారు. మరి ఇక్కడి నుంచి ఎందుకు పాలన చేయడం లేదని నిలదీశారు.
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి నెల రోజులవుతున్నా ఒక్క ఆధారం కూడా చూపలేదన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఇంకా పేపర్ల మీద ఉండగానే కేసులు పెడుతున్నారన్నారు. తెలంగాణ ఎన్నికలు ఉన్నాయనే కృష్ణా జలాల విషయంలో కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. అనంతపురంలో ప్రభుత్వాన్ని వైసీపీ కార్పొరేటర్లే నిలదీస్తుంటే, ఇంకెక్కడ 175 సీట్లని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రశాంతత రావాలంటే సీఎం జగన్ పాలన పోవాలని దీని కోసం అంతా ఐక్యం కావాలన్నారు.













