రెండేళ్లలో కొత్తగా వచ్చిన… పరిశ్రమలు ఎన్ని ?

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గత రెండేళ్లలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఎన్ని అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేకపోగా, ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. లులూ గ్రూప్, రిలయన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ట్రైటాన్ వంటి సంస్థల పెట్టుబడులు తరలిపోయినట్లు తెలుస్తోందని తెలిపారు. పారిశ్రామిక పురోగతి లేకుండా రాష్ట్ర ప్రగతి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
ఆంధప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా గెలిపించిన పారిశ్రామికవేత్త పరిమల్ నత్వాని కూడా రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వచ్చాయని నిలదీశారు. గత రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎన్ని ఉద్యోగాలిచ్చిందంటూ ప్రశ్నించారు. ఏ ప్రభుత్వంలో లేని ఆశలు ఈ ప్రభుత్వంపైన ఉన్నాయి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని జగన్ తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిపోయింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆ ఉద్యోగాలు తానే ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో 30 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ తెలిపింది. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో ప్రకటించకుండా పది వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చారని తెలిపారు.