ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. మార్చుకుంటూ పోతారా?
మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం సరైంది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో శాసనసభలో అమరావతిని ఏపీ రాజధానిగా అంగీకరించిన విషయాన్ని జగన్ గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. అమరావతిని నిర్వీర్యం చేయాలనే కుట్రతోనే జగన్ 3 రాజధానుల అంశాన్ని మరోమారు తెరపైకి తెస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ పోతారా? అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం శాసనసభలో చేసిన నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం మార్చాలనుకోవడం శాసన వ్యవస్థను అవమానించడమేనన్నారు. నిజంగా శాసనవ్యవస్థపై జగన్ ప్రభుత్వానికి గౌరవముంటే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై కోర్టులు పదేపదే మొట్టికాయలు వేసినా జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.













