తెలంగాణలో కలుస్తామని తీర్మానం చేశారంటే.. సిగ్గుతో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అంతా బాగుందని జగన్ ప్రభుత్వం చెబుతోందని సీబీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ దిగే నాటికి రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల మేర అప్పు ఉండడం ఖాయమన్నారు. అప్పులు చేస్తున్నారు, కానీ అభివృద్ధి ఎక్కడా కన్పించడం లేదని అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. అప్పులు, ఖర్చులపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని, ఏపీ అభివృద్ధికి జగన్ సైంధవుడిలా అడ్డం పడుతున్నారని మండిపడ్డారు. విలీన మండలాల్లోని ఐదు గ్రామాలు ప్రజలు తెలంగాణలో కలుస్తామని తీర్మానం చేశారంటే సీఎం జగన్ సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు.













