చంద్రబాబుకు హైకోర్టులో ఊరట
ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగుళ్లు కేసుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో 12వ తేదీ వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ 16వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రెండు కేసుల్లోనూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును ఆయన తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. కేసుల్లో విచారణకు సహకరిస్తామని న్యాయస్థానానికి తెలిపారు. ఈ విషయంపై సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు సూచించింది.
ఏసీబీ కోర్టులో పీట్ వారెంట్ పెండింగ్‌లో ఉందని కోర్టుకు ఏజీ శ్రీరామ్ తెలిపారు. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం రెండు కేసుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను హైకోర్టు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగళ్లు కేసులో గురువారం వరకు అరెస్టు, పీటీ వారెంట్ అడగమని హైకోర్టుకు పోలీసులు హామీ ఇచ్చారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో పీటీ వారెంట్‌పై హైకోర్టు స్టే ఇచ్చింది.













