ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తాం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పొత్తులు లేకుండా 175 స్థానాల్లో పోటీచేస్తున్నట్టు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలంటే హస్తం గుర్తుకే ఓటెయ్యాలన్నారు. వేరే ఎవరికి ఓటు వేసినా.. నష్టమని.. వేరేవాళ్లకు ఓట్లు వేస్తే.. వారికి మాత్రమే ప్రయోజనమన్నారు. ఇది ఏఐసీసీ తీసుకున్న నిర్ణయమని.. ఆంధ్రప్రదేశ్ ఇంఛార్జి ఉమెన్ చాందీ ద్వారా తమకు తెలియజేశామని రఘువీరా తెలిపారు. టీడీపీతో అవగాహన జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితమని తెలిపారు. ఈ నెల 31న అన్ని నియోజకవర్గాల నాయకులతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుకు ముడిపడి ఉన్న అంశం ఇది అని తెలిపారు.













