Kiran Royal: తిరుపతి జనసేనలో కలకలం.. ప్రశ్నార్థకంగా కిరణ్ రాయల్ పొలిటికల్ ఫ్యూచర్..
కిరణ్ రాయల్(Kiran Royal) .. తిరుపతి జనసేనలో (Tirupati Janasena) అందరికీ తెలిసిన పేరు. జనసేన ఆవిర్భావం నుంచి తన గొంతుకను పార్టీ గొంతుకగా మార్చుకున్న ఆయనపై ఇప్పుడు రాజకీయంగా వివాదాస్పద ఆరోపణలు తలెత్తాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పట్ల అతని విశ్వాసం, పార్టీ కోసం పోరాటం అన్నీ గత కాలం విషయమా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, రాజకీయ పరిశీలకులు కిరణ్ రాయల్ భవిష్యత్తు ప్రశ్నార్థకమని భావిస్తున్నారు.
ఇప్పటివరకు కిరణ్ రాయల్ జనసేనలో పవర్ఫుల్ నేతగా కొనసాగుతూ, ప్రత్యర్థులను తిప్పికొడుతూ వచ్చారు. కానీ ఇటీవల లక్ష్మీ రెడ్డి అనే మహిళ కేసుతో ఆయనపై వివాదాలు చుట్టుముట్టాయి. లక్ష్మీ రెడ్డి తన భర్త మరణం తర్వాత కిరణ్ రాయల్‌తో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు, సాన్నిహిత్య సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు చేసింది. ఆమె మీడియాకు అందించిన ఫొటోలు, వీడియోలు ఈ వివాదాన్ని మరింత ముదిరించాయి. అయితే, ఇవన్నీ మార్ఫింగ్ ఫోటోలు, కావాలని తనను ఇరికించే కుట్ర అని కిరణ్ రాయల్ చెబుతున్నారు.
ఇదంతా ఒక వ్యక్తిగత వివాదమా? లేక దీని వెనుక రాజకీయ కుట్ర ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వర్గం సహా జనసేనలో కొంతమంది కిరణ్ రాయల్‌పై వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు తోడు కొన్ని మీడియా వర్గాలు కూడా ఈ అంశాన్ని ఎలివేట్ చేస్తూ కథనాలు ప్రసారం చేయడం గమనార్హం. మరోవైపు, వైసీపీకి చెందిన న్యాయవాదులు లక్ష్మీ రెడ్డికి మద్దతుగా నిలబడటం, ఈ వివాదాన్ని మరింత కాంప్లికేట్ చేస్తున్నాయి.
కిరణ్ రాయల్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జనసేన పెద్దలు ఆయనను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండమని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో జనసేనలో ఆయన వ్యతిరేక వర్గం కిరణ్ ఇక పార్టీ నుంచి పూర్తిగా తప్పుకోనున్నారని ప్రచారం ప్రారంభించింది. అయితే, కిరణ్ రాయల్ వర్గం మాత్రం ఇది తాత్కాలికం మాత్రమే, పవన్ కళ్యాణ్‌కు ఆయనపై నమ్మకం ఉందని, వివాదం సద్దుమణిగిన తర్వాత మళ్లీ ఆయన కీలక బాధ్యతలు చేపడతారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, కిరణ్ రాయల్ తనపై పెట్టిన ఆరోపణలను తిప్పికొట్టేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మీ రెడ్డితో పాటు పసుపులేటి సురేశ్ అనే వైసీపీ నాయకుడిని నిందితులుగా చేర్చారు. గతంలో జనసేనలో యాక్టివ్‌గా ఉన్న సురేశ్, కిరణ్ రాయల్‌తో విభేదించి వైసీపీలో చేరాడు. ఇప్పుడు ఈ వివాదంలో అతని పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపుతోంది.
ఇక లక్ష్మీ రెడ్డి మాత్రం తన దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయంటూ రోజుకో వివరణ ఇస్తూ వస్తోంది. దీనివల్ల ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. గతంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా ఇలాంటి కేసులో చిక్కుకుని హైకోర్టులో ఊరట పొందినా, రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కిరణ్ రాయల్ విషయంలోనూ అదే తరహాలో ప్రత్యర్థులు ముందుకు వెళతారని భావిస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య, పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారనేదే ప్రధాన ప్రశ్న. క్లీన్ ఇమేజ్ కోసం పాటుపడే పవన్, కిరణ్ రాయల్ విషయంలో కఠినంగా వ్యవహరించవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. మరోవైపు, కిరణ్ రాయల్ ను బయటకు పంపేందుకు కొందరు కావాలని కుట్రలు పన్నుతున్నారని ఆయన వర్గీయులు వాదిస్తున్నారు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో, కిరణ్ రాయల్ భవిష్యత్తు ఏం అవుతుందో చూడాలి.













