నాలుగు అంశాలపై సమగ్ర చర్చ
సంక్షేమం, మౌలికం, జన్మభూమి-మాఊరు, భూముల సమస్యలు
నాలుగు అంశాలపై సమగ్ర చర్చ
నేడు జిల్లా కలెక్టర్ల 19 వ సదస్సు
అమరావతి, డిసెంబర్ 28 : సంక్షేమం, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల పురోగతి, 6వ విడత జన్మభూమి-మాఊరు, చుక్కల భూములు వంటి నాలుగు ప్రధాన అంశాలే అజెండాగా జిల్లా కలెక్టర్ల 19వ సదస్సు ఈనెల 29వ తేదీన (రేపు) జరగనున్నది. శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వ తొలి పది ప్రధాన కార్యక్రమాలపై సమాలోచన సాగుతుంది. గ్రామాలలో 10 స్టార్, పట్టణ ప్రాంతాలలో 9 స్టార్ రేటింగ్ ఇస్తున్న కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సమీక్షిస్తారు.
సంక్షేమరంగానికి సంబంధించి నూరుశాతం నిత్యావసరాల పంపిణీ, రేషన్ కార్డుల అందజేత, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, చంద్రన్న పెళ్లి కానుక, ముఖ్యమంత్రి యువనేస్తం, చంద్రన్న బీమా, గృహ నిర్మాణం వంటి పథకాలపై చర్చ ఉంటుంది. మౌలిక సదుపాయాలకు సంబంధించిన చర్చలో ఘన వ్యర్ధాల నిర్వహణ, ఎల్ఈడీ విద్యుద్దీపాలు, మురుగు కాల్వల వ్యవస్థ, ఫైబర్ గ్రిడ్, రహదారులు (అనుసంధానత, సీసీ రోడ్లు), తాగునీరు, గ్యాస్ సరఫరా, విద్యాలయాలలో మరుగుదొడ్లు సహా అన్ని మౌలిక వసతులపై చరిస్తారు.
ఈ రెండు అంశాలతో పాటు కొత్త ఏడాదిన ఆరంభం కాబోయే ‘జన్మభూమి-మా ఊరు’ 6వ విడత కార్యక్రమ ఎజెండా, ఏర్పాట్లపై చర్చిస్తారు. ఈ విడత జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా ప్రజల ముందుంచనున్న రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రగతి ప్రణాళికా వ్యూహాలపై సమగ్రంగా చర్చించి ఖరారు చేస్తారు.
అన్నింటికంటే ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు కీలకమైన అంశాలపై చర్చించి తగిన వ్యూహాల్ని ఖరారు చేస్తారు. చుక్కల భూములు వంటి సమస్యలపై జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి ఆయా కలెక్టర్లతో సమీక్షిస్తారు.
సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షను మూడు సెషన్లుగా చేపట్టనున్నారు. రేషన్ కార్డుల పంపిణీ మొదలు గృహ నిర్మాణం వరకు వున్న అంశాలను తొలుత చర్చిస్తారు. తరువాత సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షిస్తారు. వీటికింద అన్న క్యాంటీన్లు, నూరు యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యం-పౌష్టికాహారం, మాతాశిశు మరణాలు, రక్తహీనత, పౌష్టికాహార లోపం, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలోని ఆరోగ్య పథకాలు, ఇళ్ల నుంచి ఘన, ద్రవ వ్యర్ధాల సేకరణ, ఇంటింటికీ నీటి సరఫరా, పాఠశాలల్లో హాజరు శాతం, మధ్యాహ్న భోజనం వంటి ఇతర సంక్షేమ కార్యక్రమాలపై తదుపరి సమీక్ష ఉంటుంది.
ఇక, మూడవ సెషన్లో పేదరికంపై గెలుపు, జన్మభూమి, ఆదరణ, కుటుంబానికి నెలకు కనీసం పదివేల ఆదాయం వంటి ప్రభుత్వ ప్రాధాన్య అంశాలను సమీక్షిస్తారు. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు, శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర మంత్రులు ఈ ఒకరోజు సదస్సులో పాల్గొంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీటా తొలుత సదస్సుకు ఆహ్వానం పలుకుతూ ప్రసంగిస్తారు. తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూ ముఖ్య ప్రసంగం చేస్తారు.













