Bhimavaram: ఛైర్మన్, డిప్యూటీ స్పీకర్ మధ్య కలెక్టరేట్ చిచ్చు..!!

వైసీపీ హయాంలో జిల్లాల పునర్విభజన జరిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా భీమవరం ఏర్పాటైంది. భీమవరంలో (Bhimavaram) ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ (integrated collectorate) నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్ యార్డ్ స్థలం కూడా కేటాయించింది. అయితే అది సాకారం కాలేదు. ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు చంద్రబాబు (CM Chandrababu)ప్రభుత్వం పెదఅమిరం పరిధిలో కలెక్టరేట్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు (Raghu Rama Krishna Raju – RRR) దీనికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమయ్యారు. అయితే భీమవరం నుంచి కలెక్టరేట్ ను తరలిస్తే ఒప్పుకునేది లేదని మండలి ఛైర్మన్ మోషేన్ రాజు (Moshen Raju) హెచ్చరించారు. దీంతో కలెక్టరేట్ చుట్టూ వివాదం రేగుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా 1925 ఏప్రిల్ 15న జిల్లాగా మారింది. ఏలూరు జిల్లా కేంద్రంగా ఉండేది. 2022 పునర్విభజన తర్వాత భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడింది. జిల్లాలో 19 మండలాలు, 248 పంచాయతీలు ఉన్నాయి. గోదావరి, కృష్ణా నదులు, కొల్లేరు సరస్సు ఇక్కడి ప్రధాన నీటి వనరులు. భీమవరం మార్కెట్ యార్డ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే జిల్లాకు పరిపాలన భవనం లేదు. అన్నీ అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. దీనివల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వం కలెక్టరేట్ నిర్మాణానికి ప్రాథమిక చర్యలు చేపట్టింది. భీమవరం మార్కెట్ యార్డ్ స్థలంలో సమీకృత కలెక్టరేట్ నిర్మించేందుకు భూమి గుర్తించారు. రూ.5 కోట్లు నిధులు కూడా కేటాయించారు. అయితే భూ సమస్యలు, నిధుల కొరత వల్ల పనులు ప్రారంభం కాలేదు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. టీడీపీ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి రూ.70 కోట్లు కేటాయించారు. అయితే కలెక్టరేట్ నిర్మాణానికి స్థలం సమస్యగా మారింది. దీంతో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణరాజు ఉండి నియోజకవర్గం పరిధిలోని పెద్ద అమిరం ప్రాంతంలో కలెక్టరేట్ నిర్మించాలని ప్రతిపాదించారు. తాను స్థలం సమకూరుస్తానని, నిర్మాణ వ్యయంలో సగం (రూ.35 కోట్లు) తాను భరిస్తానని ప్రకటించారు.
అయితే, ఈ ప్రతిపాదనను వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మండలి చైర్మన్ మోషేన్ రాజు దీన్ని తిరస్కరించారు. భీమవరంలోనే కలెక్టరేట్ నిర్మించాలని డిమాండ్ చేశారు. పెద్ద అమిరంలో నిర్మించాలని చూస్తే తీవ్ర ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. భీమవరం జిల్లా కేంద్రం కాబట్టి అక్కడే కలెక్టరేట్ ఉండాలన్నారు. ఇతర ప్రాంతాలకు మార్చడం జిల్లా ప్రజలకు అన్యాయం చేయడమేనని మోషేన్ రాజు అన్నారు.
భీమవరంలోనే కలెక్టరేట్ నిర్మించాలని వైసీపీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న రఘురామ కృష్ణరాజు మాత్రం ఉండి పరిధిలోని పెదఅమిరంలో నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. భీమవరం, ఉండి వేర్వేరు కాదని, రెండూ తనకు ఒకటేనని ఆయన చెప్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందనేది ఆసక్తి రేపుతోంది.