Vangalapudi Anitha: నక్కపల్లి గురుకులంలో.. హోంమంత్రి భోజనంలో బొద్దింక కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి (AP home minister) వంగలపూడి అనిత (Vangalapudi Anitha)కి అనూహ్యంగా ఓ షాక్ తగిలింది. పాయకరావుపేట (Payakaraopeta) నియోజకవర్గంలోని నక్కపల్లి (Nakkapalli) ప్రాంతంలో ఉన్న బీసీ బాలికల గురుకుల హాస్టల్‌ను సందర్శించేందుకు వచ్చిన ఆమె, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. విద్యార్థులకు ఎలాంటి వసతులు అందుతున్నాయో స్వయంగా తెలుసుకునేందుకు హాస్టల్‌ను తిరిగి పరిశీలించారు.
తనిఖీలు పూర్తయిన తరువాత భోజన సమయం కావడంతో హోంమంత్రి అనిత అక్కడే బాలికలతో కలిసి భోజనం చేయాలని నిర్ణయించుకున్నారు. హాస్టల్ సిబ్బంది ఆమెకు కూడా భోజనం వడ్డించారు. విద్యార్థులతో కలిసి మధ్యలో కూర్చుని భోజనం మొదలుపెట్టిన సమయంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆమె ప్లేట్‌లో బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఈ ఘటనతో హోంమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన ప్లేట్‌లోనే బొద్దింకలు కనిపిస్తే, అక్కడే నివసించే బాలికలకు ఎలా నాణ్యమైన ఆహారం అందిస్తారని నిలదీశారు. అలాగే హాస్టల్ సిబ్బందిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆమె తినే ఆహారం పరిస్థితి ఇలా ఉంటే , విద్యార్థుల ఆహారం పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ఆందోళన కలిగించే విషయం. ఈ నేపథ్యంలో అనిత తన ప్లేట్‌లో కనిపించిన బొద్దింకను అక్కడే ఉన్న అధికారులకు చూపించడంతో వారూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ సందర్భంలో హాస్టల్ సిబ్బంది కూడా అప్రమత్తమై ఇక ఇలాంటివి పునరావృతం కాదు అని హామీ ఇచ్చారు.
ఈ ఘటనపై అక్కడి స్థానికులు, సోషల్ మీడియా వేదికలపై చర్చ మొదలైంది. ప్రభుత్వ హాస్టళ్లలో శుభ్రతపై ప్రశ్నలు మళ్లీ మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తున్న విద్యాసంస్థల్లో ఈ తరహా పరిస్థితులు ఉండటం తగదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓ హోంమంత్రి ప్రత్యక్షంగా అనుభవించిన ఈ ఘటన, అధికార యంత్రాంగం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్న సంకేతంగా మారింది. విద్యార్థుల ఆరోగ్యం కోసం హాస్టళ్ల నిర్వహణలో ఉద్ధేశించిన ప్రమాణాలతో మరింత జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది అనడానికి నిదర్శనంగా నిలుస్తుంది.