మహిళా సంక్షేమం కోసం ఏ ప్రభుత్వమూ చేయనంత కృషి: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు మానవాళిలో సగభాగమే కాకుండా, అభివృద్ధిలో అంతకు మించిన పాత్ర పోషిస్తున్నారని సీఎం కొనియాడారు. ‘మహిళల అభ్యున్నతే సమాజం ప్రగతికి కొలమానం. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ సాధికారతలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. దేశంలో మరే రాష్ట్రమూ ఈ విషయాలకు ఏపీ ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వలేదు’ అని జగన్ తెలిపారు. జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, జగనన్న విద్యా దీవెన్, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ తదితర సంక్షేమ పథకాలతో కడుపులోని శిశువు నుంచి పండు ముదుసలి వరకు అందరికీ అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఏపీలో మాత్రమే ఉందని ఆయన చెప్పారు. మహిళల రక్షణ, భద్రత కోసం దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.













