అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు : వైఎస్ జగన్
సంక్షేమ పథకాల లబ్ధిదారులను నిర్దిష్ట కారణం లేకుండా తిరస్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించాలని సృష్టం చేశారు. స్పందనపై జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అర్హులకు 10 రోజుల్లో బియ్యం కార్డు, పింఛను కార్డు ఇవ్వాలని, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ, 90 రోజుల్లోనే ఇళ్ల పట్టా అందించాలని నిర్దేశించారు. దరఖాస్తు చేసిన వారు అర్హులని తేలితే తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనన్నారు.
సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. పేదలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, త్వరలో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని సీఎం వెల్లడించారు. పథకాల వర్తింపుపై సంయుక్త కలెక్టర్లు బాధ్యత వహించాలని సూచించారు. అర్హులకు సకాంలో సంక్షేమ పథకాలు అందిచలేకపోతే పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.













