ఏపీ చరిత్రలో గొప్ప కార్యక్రమం : వైఎస్ జగన్
ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభం కార్యక్రమం జనవరి 20 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. స్పందన కార్యక్రమంపై సమీక్షలో భాగంగా ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభంపై జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఇప్పటివరకూ 39 శాతం ఇళ్లస్థలాలు పంపిణీ పూర్తైందని పేర్కొన్నారు. 17వేలకు పైగా కాలనీల్లోని 9,668 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్లస్థలాల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పాలనలో పారదర్శకతను తారస్థాయికి తీసుకుని వెళ్లామని, ఇక ముందు కూడా దీనిని కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు.
ఆంధప్రదేశ్ చరిత్రలో గొప్ప కార్యక్రమం జరిగింది. ప్రతి కలెక్టర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది. వారి అందరి దీవెనలు మీకు లభిస్తాయి. నాతోపాటు, మీ అందరికీ కూడా ఈ సంతోషం ఉంటుంది. లే అవుట్స్‌లో ఇంటి నిర్మాణాలు కొనసాగించడం ఒక కార్యక్రమమైతే, వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడం మరొక కార్యక్రమం. రోడ్లు, కరెంటు, తాగునీరు..లాంటి కనీస సౌకర్యాలు కల్పించాలి. కాలనీ పరిమాణాన్ని బట్టి ఇతర సోషల్ ఇన్ఫాస్ట్రక్చర్ను కూడా పెట్టాలి. స్కూళ్లు, అంగన్వాడీలు, పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ లాంటివి రావాలి. కాలనీ పరిమాణం, జనాభా బట్టి వీటిని ఏర్పాటు చేయాలి.
ఇందుకు సంబంధించి ఎస్ఓపీని తయారు చేయాలి. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేసరికి అవన్నీ పూర్తి కావాలి. ఒక లే అవుట్లో పనులు ప్రారంభించిన తర్వాత అవన్నీ పూర్తికావాలి. కాలనీలో పనులు మొదలుపెట్టిన తర్వాత అందులో ఉన్న అన్ని ఇళ్లనూ పూర్తి చేయాలి. ఒకవేళ అదనంగా ఇళ్ల నిర్మాణాన్ని మంజూరు చేయాల్సి వస్తే.. వెంటనే దానికి అనుగుణంగా మంజూరు చేసి కాలనీలో అన్ని ఇళ్లనూ పూర్తిచేసేలా చర్యలు తీసుకుందా అని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.













