విశాఖలో మరోసారి సీఎం జగన్ పర్యటన
మరోసారి విశాఖలో పర్యటించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ నెల 11న విశాఖలో మరోసారి ఆయన పర్యటిస్తారని తెలుస్తోంది. పీఎం పాలెంలోని క్రికెట్ స్టేడియంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. తన పర్యటనలో భాగంగా సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్వహించే కొన్ని కార్యక్రమాలకు కూడా హాజరవుతారని సమాచారం. అనంతరం అరిలోవలో అపోలో కేన్సర్ సెంటర్ను ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత రామ్ నగర్లో వాణిజ్య సముదాయం, బీచ్ రోడ్లో సీ-హారియర్ మ్యూజియం, ఎంవీపీ కాలనీలో ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాలను కూడా సీఎం ప్రారంభిస్తారు. భీమిలిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్, యెండాడలో కాపు భవన్కు శంకుస్థాపన కూడా చేస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడు సాయి వివాహం కూడా జరుగుతోంది. ఈ వివాహ వేడుకకు కూడా సీఎం హాజరవుతారు. అనంతరం రాత్రి 7 గంలకు విశాఖ నుంచి రిటర్న్ వస్తారు.













