కడప జిల్లాలో సీఎం పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన మూడురోజుల పాటు కొనసాగనుంది. డిసెంబర్ 23 నుంచి 25వరకు సాగే ఈ పర్యటనలో జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప జిల్లా ఎయిర్‌పోర్ట్‌కు ఆయన చేరుకోనున్నారు. అక్కడి నుంచి అమీన్ పీర్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి నివాసానికి వెళ్తారు. ఆ తర్వాత కమలాపురం చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. డిసెంబర్ 24న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి అక్కడి చర్చిలో జరిగే ప్రార్థనలకు హాజరవుతారు. ఆ తర్వాత పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసే సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగం ఇస్తారు. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే ప్రత్యేక పార్థనల్లో పాల్గొని అనంతరం అక్కడి నుంచి తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.













