సచివాలయ ప్రవేశం పై సీఎం జగన్ వాయిదా
ఆంధ్రప్రదేశ్ కు రెండో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన వైఎస్ జగన్ పెన్షన్ ఫైలుపై తొలి సంతకం చేసి, దానికి సంబంధించిన జిఒ ను కూడా తీసుకువచ్చారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ వెలగపూడిలోని ఎపీ సచివాలయంలో అడుగుపెట్టి అక్కడి నుండే పాలన మొదలు పెట్టాలని భావించారు. కొన్ని శాఖలకు సంబంధించిన సమీక్షలు నిర్వహించాలనుకున్నట్లు సమాచారం. సుముహూర్తం లేకపోవడంతో సీఎం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాడేపల్లిలోని తన ఇంటి వద్ద నుంచే జగన్ పరిపాలన కొనసాగిస్తున్నారు. డిజిపి గౌతమ్ సవాంగ్ సీఎం జగన్తో ఆయన నివాసంలోనే కలుసుకుని చర్చించారు. రాష్ట్ర సిఎస్ ఎల్.వి.సుబ్రహ్మణ్యం, మరి కొందరు ఉన్నతాధికారులు కూడా జగన్ ను తాడేపల్లి నివాసంలో కలుసుకుని రాష్ట్ర స్థితిగతులపై నివేదికలు సమర్పిస్తారని తెలుస్తోంది. మంచి ముహూర్తంలో సచివాలయంలో బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.













