ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచండి : సీఎం జగన్ ఆదేశం
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. గురువారం సీఎం జగన్ కోవిడ్‌పై తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ సోకిన వారికి సహాయం అందజేయాలని, అలాగే కోవిడ్ లక్షణాంలుటే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలో కూడా సూచించాలని అధికారులను కోరారు. కరోనా సోకిందంటూ ఫోన్ చేస్తే, అలాంటి వారికి మూడు గంటల్లోగా ఆస్పత్రిలో ఓ బెడ్ కేటాయించాలని, ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ను కూడా అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఇలాంటి క్లిష్ట సమయంలో 104 కాల్ సెంటర్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, దానిని మరింత ప్రాచుర్యంలోకి తేవాలని నొక్కివక్కానించారు. ఆరోగ్య సిబ్బంది, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇలా అందరూ శ్రమించడం వల్లే ఒక్క రోజులోనే 6 లక్షల వ్యాక్సిన్ డోసులు ఇచ్చామని సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించేలా చూడాలని అధికారులను కోరారు. అంతేకాకుండా భౌతికదూరం పాటించేలా చూడాలని సీఎం జగన్ సూచించారు.
24 గంటల్లోనే 5,086 పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా రోజురోజుకీ పెరిగిపోతోంది. 24 గంటల్లోనే 5,086 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. కోవిడ్‌తో 14 మంది మృతి చెందారు. మరోవైపు 1,745 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొన్నారు. తాజా గణాంకాలతో ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య 9,42,135కి చేరుకుంది. 9,03,072 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,710 యాక్టివ్ కేసులున్నాయని, ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1,55,70,201 శాంపిల్స్‌ను పరీక్షించామని వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.













