మా దగ్గర మాత్రం.. ఆ పరిస్థితి లేదు : వైఎస్ జగన్
ఎక్కడైనా ప్రతిపక్షాలు రాష్ట్ర పరువును కాపాడేలా ఉంటాయని, మన దగ్గర మాత్రం ఆ పరిస్థితి లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న వసతి దీవెన రెండో విడత కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమచేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. దేవుడి దయ, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఎవరెంతగా బురదచల్లినా తననేమీ చేయలేరని అన్నారు. రోజుకో కట్టుకథ, రోజుకో వక్రీకరణతో ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు బురద చల్లుతున్నారని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుంటే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇక్కడితో ఆగకుండా పార్లమెంట్ వేదికగానూ రాష్ట్ర ప్రభుత్వ పరువు తీసుకున్నారని విమర్శించారు.
దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో తాను ఈ స్థానానికి చేరుకున్నానని తెలిపారు. ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని అన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో రూపురేఖలు మారాయని, ప్రభుత్వ బడుల్లోకి చేరికలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలకు ఎమ్మెల్యేలు రికమెండేషన్ లేఖలు ఇస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా మారిందో అర్థం చేసుకోవాలని కోరారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ ఇస్తున్నామని అన్నారు. ఒక కుటుంబంలో ఎంత మందిని చదివించినా మీకు తోడుగా నేను ఉంటా. తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం వల్ల వారు కళాశాలలకు వెళ్తారు. రాష్ట్రంలో అమ్మఒడి ద్వారా 44 లక్షల మంది తల్లులకు మేలు జరుగుతోందన్నారు. కొత్తగా రాష్ట్రానికి 16 వైద్య కళాశాలలు వస్తున్నాయని తెలిపారు.













