విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు : వైఎస్ జగన్
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది తమ ప్రభుత్వమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. బాపట్లలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యాదీవెన పథకం కింద మూడో విడత రూ.694 కోట్ల నిధులను బటన్ నొక్కి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నత విద్యకు ఫీజు ఎంత ఉన్నా తమ ప్రభుత్వమే చెల్లిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పెండిరగ్లో ఉంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,778 కోట్లనూ తామే చెల్లించామన్నారు.
ఈ పథకంలో రాష్ట్రంలో 11 లక్షల మందికి లబ్ది చేకూరుతోందని వివరించారు. రాబోయే కాలంలో ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన విద్యా వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పిస్తున్నట్లు తెలిపారు. పోటీ ప్రపంచానికి తగ్గట్లుగా విద్యా వ్యవస్థ. విద్యా ప్రణాళికలో మార్పులు తెచ్చినట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయడం ద్వారా చదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. గత మూడేళ్లలో విద్యారంగ అభివృద్ధికి రూ.53 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఎక్కడా వివక్షకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. ఏప్రిల్, మే, జూన్ ఈ మూడు నెలలకు సంబంధించిన వందశాతం ఫీజురియింబర్స్ మెంట్ చెల్లిస్తున్నామని అన్నారు.













