ఆ లక్ష్యంతోనే పని చేయాలి : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) పనితీరు పైన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగం ఉండకూడదన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం పోలీసు, ఆబ్కారీ శాఖ కలిసి పని చేయాలని అధికారులకు సూచించారు. నార్కొటిక్స్‌కు వ్యతిరేకంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో భారీ హోర్డింగ్స్ పెట్టాలన్నారు. ఎస్ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ను బాగా ప్రచారం చేయాలని కోరారు. అక్రమ మద్యాన్ని అరికట్టాలని, గంజాయి సాగు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దిశ చట్టం, యాప్ ఇంకా సమర్థంగా అమలు కావాల్సిన ఆవశ్యకతను సీఎం గుర్తు చేశారు.













