రాష్ట్రంలో కొవిడ్ ఆసుపత్రుల సంఖ్య పెంపు : వైఎస్ జగన్
కొవిడ్ ఆసుపత్రుల సంఖ్యను 138 నుంచి 287కు పెంచాలని ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 287 ఆసుపత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు, సరిపడా వైద్యులు, సిబ్బంది ఉండాలని సూచించారు. అదేవిధంగా స్పెషలిస్టులను, డాక్టర్లను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
కొవిడ్ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎప్పటికప్పుడు లోపాలను, సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించాలన్నారు. హోం క్వారంటైన్లో ఉన్నవారికి సేవలు సక్రమంగా అందాలని అధికారులకు నిర్దేశించారు. మందులు ఇవ్వడం సహా సత్వర చికిత్స అందించాలన్నారు. అందిస్తున్న సేవలకు అనుగుణంగా కొవిడ్ ఆసుపత్రులకు రేటింట్ ఇవ్వాలని ఆదేశించారు. నిరంతరంగా ఆస్పత్రుల్లో ప్రమాణాలను పర్యవేక్షించాలని చెప్పారు. కొవిడ్కాల్ సెంటర్లు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.













