రెండో డోసు వారికే అధిక ప్రాధాన్యం : సీఎం జగన్

45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పూర్తైన తర్వాత, మిగితా వారికి ఇస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. మొదటి డోస్ తీసుకొని, రెండో డోస్ కోసం వేచి చూస్తున్న వారికి అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో వైద్యులు, సిబ్బంది చేస్తున్న సేవలు నిరుపమానమని, ఓ తల్లి మాదిరి సేవలు చేస్తున్నారని కొనియాడారు. వైద్యులకు, వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా ధన్యవాదాలు ప్రకటించారు సీఎం. ప్రాణాంతకం అని తెలిసినా రోగులకు సేవలు చేస్తూనే ఉన్నారని, ఎలాంటి సహాయ, సహకారం వారికి కావాలన్న అందించేందుకు తాము సిద్ధమని పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య సిబ్బందితో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 104 కు ఎవరైనా ఫోన్ చేస్తే సకాలంలో స్పందించాలని, లేని పక్షంలో అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.
కేసులు తగ్గుతున్నాయ్…. అయితే….
కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని, కాస్త సానుకూల పరిస్థితి ఏర్పడిందని సీఎం జగన్ అన్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఇంకా మెరుగుపడాల్సి ఉందని అన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, ఎక్కువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. కరోనా సోకిన వారిలో 70 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నామని, 50 శాతం బెడ్లు కచ్చితంగా వారికి ఇవ్వాలని పునరుద్ఘాటించారు.
24 గంటల్లోగా వారిపై చర్యలు తీసుకోండి..
అత్యధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రస్తుతం మహమ్మారి సమయం నడుస్తోందని, ప్రతి పేదవాడికి సేవలు చేయాల్సిన సమయం ఇది అని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కచ్చితంగా నిబంధనలు అమలు కావాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తరుచూ తప్పులు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని స్పష్టంగా ఆదేశించారు. మొదటి సారి తప్పు చేస్తే జరిమానా విధించాలని, రెండోసారి తప్పు చేస్తే ఏకంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిటింగ్ జరగాలని, ప్రతి ఆస్పత్రిలో ఆక్సిజన్ నిల్వలుండేలా చూడాలన్నారు. రెమిడేసివిర్ ను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.