దీన్ని ఒక సవాల్ గా తీసుకోవాలి : వైఎస్ జగన్
రాష్ట్రంలో ఎక్కడా మాదక ద్రవ్యాల సరఫరా లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసులు ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాలేజీలు, యూనివర్సిటీల్లో మాదక ద్రవ్యాల ఆనవాల్లే ఉండకూడదన్నారు. ఆ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎవరు పంపిణీ చేస్తున్నారు? ఎక్కడ నుంచి వస్తున్నాయ్ అనే విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. దీన్ని ఒక సవాల్‌గా తీసుకోవాలని అన్నారు. అక్రమ మద్యం తయారీ, రవాణా సహా ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు.
దిశ చట్టాన్ని చాలా సమర్థంగా అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్ ఉండాలి. దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వాలంటీర్లు, మహిళా పోలీసుల సాయంతో యాప్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలి. శాసనసభలో బిల్లును ఆమోదించి ఇన్ని రోజులైన తర్వాత కూడా పెండిరగ్లో ఉండడం సరికాదన్నారు. రాష్ట్రానికి సంబంధం లేని డ్రగ్ వ్యవహారంపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి ద్రుష్పచారం చేస్తోంది. రాష్ట్ర పోలీసులు వ్యవస్థ ప్రతిష్టను, ప్రభుత్వంతో పాటు వ్యక్తుల ప్రతిష్టలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అంశాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.













