అధికారంలో ఉండటం అంటే పాలించడం కాదు: జగన్
డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేనేటి విందు కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ కన్వెన్షన్లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజా సేవకులే అన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. ‘‘మన నుంచి భగవంతుడు ఆశించేది ఒక్కటే. అధికారంలో ఉన్న వారు ప్రజా సేవకులు. ప్రజలకు ఒదిగి ఉండాలి. ఈ విషయాలను ఎప్పటికీ మరిచిపోకూడదు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. అనంతరం ప్రజల దీవెనలు, దేవుని దయతో తాను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానని, ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం దక్కిందని, ప్రజలకు ఇంతకన్నా గొప్పగా సేవ చేసే అవకాశం తనకు కల్పించాలని కోరుకుంటున్నానని జగన్ చెప్పుకొచ్చారు. క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సహా పలువురు పాల్గొన్నారు.













