కచ్చితంగా వారికి సాయం చేయాల్సిందే : వైఎస్ జగన్
ఇంట్లోకి నీరు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదనే మాట రాకూడదని, కచ్చితంగా వారికి సాయం చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మాండోస్ తుపాను కారణంగా రాష్ట్రంలో నష్టపోయిన రైతులకు పంటనష్టం పరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వారం రోజుల్లోగా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. పంటనష్టం అంచనాలో కలెక్టర్లు, అధికారులు ఉదారంగా ఉండాలని మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. పంట నష్టపోయిన రైతులు నిరాశ చెందకూడదన్నారు. రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనడం లేదని, తక్కువ ధరకు కొంటున్నారనే మాట ఎక్కడా వినిపిచకూడదని అధికారులకు స్పష్టం చేశారు. రైతులు వేయబోయే తర్వాతి పంటకు 80 శాతం రాయితీతో రైతులకు విత్తనాలు అందించాలని సీఎం ఆదేశించారు. మాండోస్ తుపాను ప్రభావంతో ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు రూ. 2 వేలు, రేషన్ అందించాలన్నారు. పట్టనాలు, పల్లెలు అని సంబంధం లేకుండా సాయం అందించాలన్నారు. గోడ కూలి ఒకరు మరణించారని సమాచారం వచ్చిందని, మరణించిన వ్యక్తి కుటుంబానికి వెంటనే పరిహారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.













