తమ ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థలో.. విప్లవాత్మక మార్పులు
తమ ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నాలుగో విడత జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం ప్రారంభించారు. ఆ తర్వాత పెదకూరపాడు నియోజకవర్గంలో రూ.217కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల్లో మెరుగైన విద్యను అధించేందుకు ఈ నాలుగేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే రోజునే విద్యాకానుక అందిస్తున్నామని తెలిపారు. ఎప్పుడూ టీడీపీ, జనసేనపైనే విమర్శలు చేసే ముఖ్యమంత్రి ఈసారి బీజేపీని కూడా ఆ జాబితాలో చేర్చారు. బీజేపీ తనకు అండగా ఉండకపోవచ్చని, తాను వాళ్లని నమ్ముకోలేదని వ్యాఖ్యానించారు. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ప్రజలే తన సైన్యమని తెలిపారు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అనేదే కొలమానంగా తీసుకోవాలని కోరారు. మంచి జరిగితే అండగా నిలవాలని జగన్ విజ్ఞప్తి చేశారు.













