ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలతో ముందుకెళుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విజయనగరంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను ఆయన ప్రారంభించారు. రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల చొప్పున ఏర్పాటు చేసి, ఒక్కో దాంట్లో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్యులు ప్రతి గ్రామానికి నెలలో రెండు రోజుల పాటు వెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం పల్లె ప్రజలకు 105 రకాల మందులు అందుబాటులో ఉంచుతూ, పద్నాలుగు రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నారని వివరించారు.
ఈ అయిదు కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం తరగతులకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో మరో 18 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. నాడు నేడులో భాగంగా పాత కళాశాలల స్థాయి పెంచాలని యోచిస్తున్నాం. వైద్య సదుపాయాలు పక్కాగా అందాలనే ఆశయంతో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకొచ్చాం. ప్రతి గ్రామానికి విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 10,032 విలేజ్ క్లినిక్స్ ద్వారా సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వాసుపత్రుల్లో అన్నిరకాల మందులూ అందుబాటులో ఉంచాం. ఆరోగ్యశ్రీలో మూడు వేలకు పైగా సేవలు అందిస్తున్నాం. 2,200లకు పైగా 104 వాహనాలు తిప్పుతున్నాం. 56 వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించాం. వివిధ విభాగాల్లోని పోస్టులు భర్తీ చేసి, ఖాళీల శాతాన్ని 3.39కు తీసుకొచ్చాం అని తెలిపారు.













