విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో సీఎంతో ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఎన్ఎండీసీని విశాఖ ఉక్కుతో అనుసంధానించాలని, దాని వల్ల సొంత గనుల సమస్య తీరుతుందన్నారు. అనుసంధానానికి కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంకు ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు సమాచారం. దాదాపు గంటకు పైగా సమావేశం జరిగింది. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కన్నబాబు, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా విశాఖలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.













