తేడా వస్తే మంత్రులు రాజీనామా చేయాలి : వైఎస్ జగన్
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులను ఆదేశించారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రులతో సీఎం కొద్దిసేపు సమావేశమయ్యారు. ఆ భేటీలో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, సన్నద్ధతపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఎన్నికల్లో గెలుపు బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. మద్యం, డబ్బు పంపిణీ చేస్తే జైలుకు వెళ్లక తప్పదని, ఈ విషయంలో అధికార పార్టీ నేతలనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. మంత్రులు సొంత నియోజకవర్గాల్లో పార్టీ ఓడితే 5 నిమిషాలు కూడా ఆలోచించనని తేడా వస్తే మంత్రి పదవులు ఉడతాయని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక ఎన్నికల్లో పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు వచ్చసారి టికెట్లు ఉండవని జగన్ సృష్టం చేశారు.
ఈ నెల8 వరకు కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలని, ఎన్నికల కోడ్ వచ్చాక పూర్తి సన్నద్ధతతో రంగంలోకి దిగాలని సీఎం దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల తర్వాతే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని మంత్రులకు జగన్ సంకేతాలు ఇచ్చారు. ఈ నెల 9 నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందన్నారు.













