ఐ ప్యాక్ గైడెన్స్…
మొన్నటివరకూ సంక్షేమమే గెలుపునకు మార్గమనుకున్నారు. వరుసగా నాలుగేళ్లపాటు బటన్ నొక్కుతూ పోయారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా జనం ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తున్నామన్నారు. మీ మామయ్యను, అన్నయ్యను, పెద్దకొడుకును కుటుంబసభ్యుడిగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా అభివృద్ధిపనులపై పడ్డారు. అదీ చివరి ఏడాదిలో హడావుడిగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. జగన్ తీరులో ఒక్కసారిగా ఎందుకింత మార్పు కనిపిస్తోంది.
జనానికి మేలు చేసే కార్యక్రమాలు.. పార్టీ నేతల మీదుగా చేయడం రాజకీయ పార్టీలు అనుసరించే విధానం. దానికి భిన్నంగా సీఎం జగన్… నేరుగా ప్రజలతో కాంట్రాక్ట్ ఉండేలా చూసుకుందామని భావించారు. ఫలితంగా బటన్ నొక్కడం మొదలు పెట్టారు. దీంతో స్థానిక నాయకులతో జనానికి పెద్దగా అవసరం లేకుండా పోయింది. దీనికి తోడు వాలంటరీ వ్యవస్థను తెచ్చారు. ఫలితంగా వైసీపీ నేతలకన్నా.. జనానికి వాలంటీర్లు ఎక్కువై పోయారు. ప్రతీదానికి వాలంటీర్ అవసరం కావడంతో.. ఇంకేముంది నాయకులను జనం పెద్దగా పట్టించుకోవడం మానేశారు. దీంతో వైసీపీ నేతలు సైతం.. సర్లే అంటూ సర్థిచెప్పుకుంటూ వచ్చారు.
ఇప్పుడేమో ఎన్నికల ఏడాది సమీపిస్తోంది. ఐప్యాక్ టీమ్ సర్వేలు చేస్తోంది. ఎమ్మెల్యేల పనితీరు, గ్రాఫ్ పై నివేదికలు పంపిస్తోంది. ఈ నివేదికల్లో అధికశాతం ఎమ్మెల్యేలు..ప్రజల్లో ఉండడం లేదని చెబుతోంది. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జనంలోకి వెళ్లి ఏం చేస్తారు? అన్నింటికీ వలంటీర్లు, గ్రామసచివాలయాలు లాంటివి పెట్టడంతో.. వీరినెవరు పట్టించుకుంటారు. ఇప్పుడేమో గడపగడపకు మనప్రభుత్వం, జగనన్న సురక్ష లాంటి పథకాలను పెట్టి.. ప్రజలకు మన పథకాలు గుర్తు చేయమంటున్నారు. అక్కడకు వెెళ్తే పథకాలు రావడం లేదని.. చాలాచోట్ల ప్రశ్నిస్తున్నారు. అసలు తాము పంచితే తమకు తెలుస్తాయి కానీ.. ఎవరి ద్వారానో పనిజరగడం, తమను ప్రజలు ప్రశ్నించడంతో.. వైసీపీ క్యాడర్ తెగ ఇబ్బంది పడిపోతోంది. ప్రజలను ఒప్పించలేక, అధిష్టానాన్ని కాదనలేక ..తమ పాట్లు తాము పడుతోంది.
ఏకంగా సంవత్సరానికి 70 వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నా.. రావలసినంత మైలేజీ లేదు. పథకాలు వట్టిగా ఇస్తున్నారా.. అది మేము కట్టిన పన్నులే కదా అని ప్రజలు ప్రశ్నించడంతో వైసీపీ పెద్దలు విస్తుపోతున్నారు. దీనికి తోడు కొన్నిచొట్లైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటూ ఐప్యాక్ నివేదికలో చెప్పినట్లు సమాచారం. దీంతో అభివృద్ధి పేరిట ఏదో ఒకటి చేస్తే కానీ గట్టెక్కలేమని భావించి జగన్ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో శంకుస్థాపన చేస్తే అది అభివృద్ధి.. చివర్లో చేస్తే అది మోసమవుతుందని జగన్ చెప్పుకొచ్చేవారు. కానీ దురదృష్టవశాత్తూ ఇప్పుడు చివరిలోనే జగన్ సైతం శంకుస్థాపనలు చేస్తున్నారు. పోర్టులు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు, గృహనిర్మాణం.. ఇలా ఒకటేమిటి అన్నింటికీ శంకుస్థాపనలు చేస్తున్నారు. తొలి నాలుగేళ్లుగా సంక్షేమాన్ని నమ్ముకున్నా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ప్రజల్లో సంతృప్తి శాతం పెరగడం లేదు. అందుకే జగన్.. జిల్లాల బాట పట్టారని వైసీపీ వర్గాల్లో టాక్.













