ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇంద్రకీలాద్రిపై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. విజయవాడ కనకదుర్గానగర్ గోశాల వద్ద రూ.216.05 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరో రూ.23.145 కోట్లతో పూర్తి చేసిన పనులను ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పనులకు సీఎం జగన్ తొలుత శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. అమ్మవారి విశేషాలతో దుర్గామల్లేశ్వర దేవస్థానం ప్రచురించిన ‘శ్రీకనకదుర్గా వైభవం-ఉపాసనా విధానం’ పరిశోధనాత్మక గ్రంథాన్ని ఆవిష్కరించారు. వేద పాఠశాల విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం ఇంద్రకీలాద్రి పైకి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ వివరాలను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ముఖ్యమంత్రికి తెలియచేశారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా గోశాల శంకుస్థాపన ప్రాంతం వరకు వివిధ కళాబృందాలు తమ ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికాయి. కేరళ సంప్రదాయ డ్రమ్స్ బృందం, తెలంగాణ కొత్తగూడెం గిరిజనుల కొమ్ము కోయ నృత్యం, భద్రాచలం ఒగ్గుడోలు, గిరిజన గుస్సాడి (నెమలి నృత్యం) కోలాటం, కూచిపూడి నృత్య బృందాల ప్రదర్శనలు అలరించాయి.
కనక దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు పెద రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి అంతరాలయంలో ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటాన్ని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దుర్గగుడి చైర్మెన్ కర్నాటి రాంబాబు, కమిషనర్ ఎస్.సత్యనారాయణ, ఈవో కెఎస్.రామారావు, వేద పండితులు అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి తానేటి వనిత, శాసన మండలి సభ్యులు తలశిల రఘరామ్, రుహుల్లా, అరుణ్‌కుమార్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, తూర్పు నియోజక వర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, దేవస్థానం కమిటీ సభ్యులు, దేవదాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలన్, దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ, కలెక్టర్ ఢిల్లీరావు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె రాణా, డీసీపీ విశాల్ గున్ని, జాయింట్ కలెక్టర్ సంపత్‌కుమార్, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితిసింగ్, ఆలయ ఈవో కె.ఎస్ రామారావు, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్.డి ప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.













